డెలివరీ తరువాత మహిళల శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. దీర్ఘకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ప్రధానంగా డెలివరీ తర్వాత స్త్రీలను వేధించే సమస్యల్లో నడుంనొప్పి ఒకటి. ఈ నొప్పి తరచూ రావడమే కాదు చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. రిలాక్సిన్ అనే హార్మోన్ ప్రెగ్నన్సీ సమయంలో విడుదలవుతుంది. ఇది పెల్విక్ ఏరియాలో లిగమెంట్స్ మరియు జాయింట్స్ ను మృదువుగా చేస్తుంది.
వెన్నులో లిగమెంట్స్ ను కూడా లూజ్ చేస్తుంది. దాంతో, నొప్పితో పాటు అస్థిరత్వం కూడా వస్తుంది. డెలివరీ అయ్యాక వచ్చే నడుంనొప్పి తీవ్రత మనిషికి మనిషికీ మారుతూ ఉంటుంది, అది తక్కువ నుంచి తీవ్రనొప్పి వరకు ఎక్కడైనా ఉండవచ్చు. తక్కువ నుంచి మామూలు నడుంనొప్పికి చేయాల్సింది దానంతట అదే తగ్గే వరకు వేచి ఉండటం. అంత శారీరక శ్రమ తర్వాత హాయిగా, ఆరోగ్యంగా మారటానికి కొంచెం సమయం పడుతుంది.
అయితే కొందరిలో ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నడుము నొప్పిని నివారించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడతారు. కానీ, పిల్లలకు పాలిచ్చే మహిళలు పెయిన్ కిల్లర్స్‌ను ఏ మాత్రం వాడరాదు. సహజంగానే నొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు కొన్ని కొన్ని చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.
బిడ్డ పుట్టిన తర్వాత సరిగ్గా బెడ్ రెస్ట్ తీసుకోకపోయినా నడుము నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే డెలివరీ తర్వాత బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి. దాంతో త్వరగా కోలుకుంటారు. కూర్చునేటప్పుడు నిటారుగా సరిగ్గా కూర్చోండి. ముఖ్యంగా ఇది బిడ్డకి పాలు ఇస్తున్నప్పుడు ముందుకి వంగే తల్లులకి అవసరం. వంగటం కన్నా బిడ్డను దగ్గరగా తెచ్చుకుని, పాలిచ్చేటప్పుడు నిటారుగా, వీపును వంగనీయకుండా కూర్చోవడం మంచిది.
అలాగే పడుకునే సమయంలో సౌకర్యవంతంగా ఉన్న పొజీషన్ లో నిద్రించాలి. మంచి పొజీషన్‌లో పడుకున్నప్పుడే నడుపు నొప్పి తగ్గు ముఖం పడుతుంది. సౌకర్యంగా ఉండే చెప్పులను ధరించాలి. డెలివరీ అయిన కొన్ని నెలల వరకు హీల్స్ కి దూరంగా ఉండి ఫ్లాట్ గా ఉండే చెప్పులను వేసుకోవాలి. పాపాయిని లేదా కొన్ని నెలల బిడ్డను ఒకవైపే ఎత్తుకోవడం మానేయాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు ముందుకి బేబీని కట్టుకునే వీలున్న ఫ్రంట్ పాక్ ను వాడటం సౌకర్యంగా ఉంటుంది.
నముడు నొప్పిని నివారించడంలో నువ్వుల నూనె గొప్పగా సహాయపడుతుంది. లైట్‌గా వేడి చేసిన నువ్వుల నూనెను నడుముకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయించుకోవాలి. అలాగే కొంతకాలం వరకు నువ్వుల నూనెతో తయారు చేసిన వంటలనే తీసుకోవాలి. తద్వారా ఎముఖలు బలంగా మారతాయి. నొప్పులు దూరం అవుతాయి.
గసగసాలు కూడా నడుము నొప్పి తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి. కొన్ని గసగసాలను తీసుకుని మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో అర స్పూన్ గసగసాల పొడి కలిపి సేవించాలి. ఇలా చేస్తే నడుము నొప్పి దరి చేరకుండా ఉంటుంది. పాలు కూడా బాగా పడతాయి.
ఇక మూడు, నాలుగు స్పూన్ల ఆవ నూనె తీసుకుని అందులో దంచిన రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించాలి. ఈ నూనెను గోరు వెచ్చగా అయిన తర్వాత నడుము రాసుకుని మసాజ్ చేయించుకోవాలి. ఇలా చేసినా నడుము నొప్పి తగ్గుతుంది.