అందంగా కనిపించడంలో గోళ్లు కూడా ఒక భాగమే. అందుకే బ్యూటీ పార్లర్ లలో అంత సమయం వెచ్చిస్తున్నారు. గోళ్ల స్వభావం ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. కొందరిలో అవి మందంగా, వేగంగా పెరగవచ్చు. లేదా పగిలి ముక్కలయ్యేవి. చీలిపోయేవి. పొరలు పొరలుగా వూడిపోయే కావచ్చు. గోరు నెలకి సుమారు 2 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది.
గోళ్లు అరిగిపోకుండా అందంగా కనిపించాలంటే వాటికి బలం కావాలి. జుట్టులాగానే గోళ్లు కూడా కెరటిన్ ప్రొటీన్‌తో ఏర్పడతాయి. గర్భవతుల గోళ్లు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల ఎక్కువ వేగంగా పెరుగుతాయి. గోళ్లలో తేమ 18 శాతం ఉంటే గోళ్ల నాణ్యతకి మంచిది. శీతాకాలంలో కన్నా వేసవిలో ఎక్కువ వేగంగా పెరుగుతుంది. గోళ్ల స్థితిని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు.
గోళ్లు పలచగా ఉన్నా, లేదా గోళ్లమీద తెల్లని మచ్చలు, గాట్లు గానీ ఉన్నా శరీరంలో జింక్ లోపం ఉన్నట్లు అర్ధం. అందుకే ఎక్కువగా చిక్కుళ్లు, పప్పు దినుసులు, పుట్టగొడుగులు, ఈస్ట్ తినాలి. గోళ్లు చంచా ఆకారంలో ఉంటే శరీరంలో ఇనుము లేదా విటమిన్ ఏ లేదా రెండూ లోపించి ఉన్నాయన్నమాట. ఆకుకూరలు, మొలకలు, క్యారట్‌లు, పుచ్చకాయ, గుమ్మడికాయ మొదలైనవి తినాలి.
గోళ్లు పెళుసుగా ఉంటే బయోటిన్ లోపం ఉన్నట్లు లెక్క. అలాంటప్పుడు పుట్టగొడుగులు,పుచ్చకాయ, పంపర పనస, అరటి పళ్లు తినాలి. గోళ్లు విరిగిపోయేట్లు, నిలువుగా, అడ్డగాట్లు ఉంటే విటమిన్ బి లోపం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం క్యారట్‌లు, పాలకూర మొదలైనవి తినాలి. గోళ్లు బాగా పెరగకపోతే జింక్ లోపం అనుకోవాలి. గోళ్లు వేలాడి పోతున్నట్లు, నొప్పిగా ఎర్రగా వాచినట్లుంటే ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి ఉన్న ఆహరాలు తినాలి. చిక్కుళ్లు, నారింజ, నిమ్మ,జామ, ఉసిరి, ఆకుకూరలు తినాలి.
వీటితో పాటు గోళ్లు బలంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా గోళ్లు కొరకడం అనే అలవాటును దూరం చేసుకోవాలి. గోళ్లను ఇష్టానుసారం కత్తిరించడం, తుంచడం వంటివి మానేస్తే వాటిని అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. గోళ్లని ఎప్పుడూ తవ్వడానికి, గిచ్చడానికి ఉపయోగించకూడదు. గోళ్లను ఎప్పుడూ పూర్తిగా తెంచివేయకూడదు.
ఇంటి పనుల్లో ముఖ్యంగా క్లీనింగ్ సమయంలో రబ్బర్ గ్లౌజ్‌లను ఉపయోగించాలి. నీటిని గోర్లు, గోరు చుట్టూ ఉండే పోర్స్ త్వరగా లాగేస్తాయి. అందుకని పనులు పూర్తయిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి. శరీరం హైడ్రేట్ కాకుండా ఉండటానికి రోజూ పది గ్లాసుల వరకు మంచినీరు తాగాలి రాత్రి పడుకునే ముందు గోరు, గోరు చివర్ల చర్మం మృదువుగా మారడానికి హ్యాండ్‌మసాజ్ క్రీమ్ లేదా నూనెతో మసాజ్ చేసుకోవాలి.
విటమిన్లు, కాల్షియం పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకుంటే గోళ్లు అందంగా పెరుగుతాయి. ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తరచూ గోళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే గోళ్లు నాజూగ్గా మారతాయి. ఆలివ్ ఆయిల్‌కు బదులుగా పాలనూ వాడవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తే గోళ్లకు జీవకళ వస్తుంది. గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి విటమిన్ ‘ఇ’ అంది ఆ భాగమంతా మృదువుగా తయారవుతుంది.
గోళ్ల సందుల్లో మురికిని తొలగించడానికి సూదులు, అగ్గిపుల్లలు వంటివి వాడడం మంచిది కాదు. మంచి మాయిశ్చరైజింగ్ లోషన్‌తో రోజూ గోళ్లకు మసాజ్ చేసుకోవాలి. గోళ్ల వద్ద రక్తప్రసరణ సవ్యంగా జరిగితే అవి బలంగా, పొడవుగా పెరుగుతాయి. మహిళలు రోజూ వీలైనన్ని ఎక్కువసార్లు మంచి నీళ్లు తాగితే చర్మం పగిలిపోకుండా ఉంటుంది. గోళ్లు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి.