తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీవేంకటేశ్వరస్వామి కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఇక్కడ కొండపైన కొన్ని రోజులు ఉన్నాడని స్థల పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, చిలుపూరు గ్రామంలోని గుట్టపైన శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. అతి ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఇక్కడ వెలసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయని నమ్మకం. ఎందుకంటే ఈ ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చే శ్రీవేంకటేశ్వరస్వామిని బుగుల్ లేదా గుబులు వేంకటేశ్వరస్వామి అని పిలుస్తారు. ఈవిధంగా వేంకటేశ్వరస్వామిని పిలవడం వెనుక ఒక పురాణం ఉంది.
ఈ ఆలయ పురాణానికి వస్తే, శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారితో వివాహం జరుగగా అప్పుడు స్వామివారు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆవిధంగా తీసుకున్న అప్పు తీర్చలేక వడ్డీ కడుతూ స్వామివారు వడ్డికాసులవాడు అయ్యాడని చెబుతారు. అయితే తీసుకున్న అప్పు తీర్చలేక స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి గుట్టపైన టాప్స్ చేసాడని స్థలపురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ వెలసిన స్వామివారిని బుగుల్ లేదా గుబులు అని పిలుస్తారు. దీనికి చింత, దిగులు అని అర్ధం. అయితే వేంకటేశ్వరస్వామి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొండక్రింది భాగంలో పాదాల గుర్తులు ఏర్పడ్డాయి. ఇలా స్వామివారి పాదాల గుర్తులు ఉన్న ఈ ప్రదేశాన్ని పాదాల గుండు అని పిలుస్తుంటారు.
ఈ విధంగా పురాతన కాలం నుండి పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇంకా శ్రీ వెంకటేశ్వరస్వామివారే అప్పుల బాధ నుండి బయటపడటానికి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు కనుక ఇక్కడ వెలసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు ఉండవని భక్తుల నమ్మకం.