భారతదేశానికి తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వాత్యంత్రం కోసం బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాడిన ఆయన్ని ఉక్కు మనిషి, సర్దార్ అని పిలుస్తారు. అయితే అక్టోబర్ 31 వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం గా స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో పిలిచే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఆవిష్కరించనున్నారు. మరి ఆ విగ్రహం వెనుక ఉన్న ఆ శిల్పి ఎవరు? ఆ విగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఆయన సాధించిన ఘనతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం వెనుక ఉన్న వ్యక్తి రామ్ వంజి సుతార్ గారు. ఆయనకి 1999 లో పద్మశ్రీ, 2016 లో పద్మవిభూషణ్ మరియు ఠాగూర్ అవార్డులు అందుకున్నారు. అయితే ప్రస్తుతం 93 సంవత్సరాల వయసు ఉన్న ఆయన గత 70 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉంటూ దాదాపుగా 50 కంటే ఎక్కువ ఎన్నో అద్భుతమైన శిల్పాలను తయారుచేసారు.
రామ్ వంజి సుతార్ గారు, 1923 వ సంవత్సరం ఫిబ్రవరి 19 వ తేదీన మహారాష్ట్రలో ఒక బీద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక కార్పెంటర్ గా పనిచేసేవారు. అయితే ఆయన చిన్ననాటి గురువైన శ్రీరామ్ కృష్ణ జోషి సహాయంతో ముంబై లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో జాయిన్ అయ్యారు. ఆలా 1953 లో ఆ కోర్సు పూర్తిచేసి టాపర్ గా నిలిచినందుకు ఆయనికి గోల్డ్ మెడల్ లభించింది.
ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ లో ఉద్యోగం చేస్తున్న ఆయన 1959 వ సంవత్సరంలో ఒక గొప్ప శిల్పి కావాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసారు.
రామ్ వంజి సుతార్ గారికి మొదటగా బాగా పేరు తీసుకువచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గాంధీ సాగర్ డ్యామ్ వద్ద చంబల్ సింబాలిక్ స్మారక చిహ్నం. దానిని చూసిన అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు గారు ఆయన పనితనం ఎంతో నచ్చి భాక్రా డ్యామ్ పైన కార్మికుల నైపుణ్యానికి గుర్తుగా 50 అడుగుల కాంస్య స్మారక కట్టడానికి నిర్మించమన్నారు. గత 70 సంవత్సరాలుగా ఆయన నిర్మించిన విగ్రహాలు రష్యా, ఇంగ్లాండ్, మలేషియా, ఫ్రాన్స్ మరియు ఇటలీలలో కూడా ఉన్నాయి.
ప్రస్తుతం స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని పూర్తి చేసిన ఆయన ఆ తరువాత మొదటి ప్రపంచ యుద్ధంలోని భారత దళాల యొక్క జ్ఞాపకార్థంగా ఏదైనా విగ్రహాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ విషయానికి వస్తే, గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది తీరంలో ఈ విగ్రహం ఉంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పిలిచే ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. ఇప్పటివరకు చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా చెప్పుకోగా ఆ విగ్రహం ఎత్తు 128 మీటర్లు.
దాదాపుగా రెండు వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ విగ్రహానికి కొన్ని వేలమంది కార్మికులు, వందలమంది ఇంజనీర్లు 42 నెలలుగా కష్టపడుతున్నారు. ఈ విగ్రహంలో 90 వేల టన్నుల సిమెంట్, 25 వేల టన్నుల ఇనుముని ఉపయోగించారు.
ఇలా ఇంతటి విశేషం కలిగిన ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా పేరుగాంచిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ వంజి సుతార్ గారి ప్రతిభకు ప్రతి ఒక్కరు రెండు చేతులు జోడించక తప్పదు.