ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ముగ్గురు అమ్మవార్లు ఈ ఆలయం లో రోజు పూజలనందుకుంటూ భక్తులకి దర్శనం ఇస్తారు. ఒక రాక్షసుడిని సంహరించి అమ్మవారు ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతుంది. మరి ఆ ముగ్గురు దేవతలు ఎవరు? ఆ దేవత ఎవరిని సంహరించింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రము కొల్లూరులో అమ్మవారు వెలసిన ఆలయం మూకాంబిక ఆలయం. ఈ ఆలయం సౌపర్ణికా నది గట్టున వెలిసింది. మూకాంబిక ఆలయం పార్వతికి అంకితమైనది. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లి పురాణం. మూకాంబికాదేవికి కర్నాటకలో మరియు తమిళనాట వేలాది మంది భక్తులు ఉనారు. తమిళులు దేవిని తాయ్ మూకాంబిక అని కొలుస్తారు. ఏడు ముక్తిస్థల క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటిగా చెబుతారు.
మూకాంబిక ఆలయంలో ఉదయం వేళలో మహాకాళికి, మధ్యాహ్నం వేళలో మహా లక్ష్మికి, సాయింత్రం వేళలో సరస్వతికి పూజలు జరుగుతాయి. ఇక్కడి దుర్గ, సరస్వతిని మూకాంబిక అని కూడా పిలుస్తారు. సరస్వతి రాక్షసుని మూగవానిగా చేయడ వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు.
పురాణగాథల ప్రకారం ఒకప్పుడు కౌమాసురుడనే రాక్షసుడు తనకు లభించిన శక్తులతో అల్లకల్లోలం సృష్టించగా దేవతలు దూరంగా వెళ్లిపోతారు. ఆ సమయంలో రాక్షసునికి అంతం సమీపించిందని సమాచారం వస్తుంది. దీనితో కౌమాసురుడు భయపడు శివుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని చెబుతాడు. రాక్షసుడు ఏ వరం కోరుతాడో ఊహించిన సరస్వతి అతని నాలుకపై నిలిచి వాక్కు రాకుండా చేస్తుంది. రాక్షసుడు మూగవాడవుతాడు అప్పుడు దుర్గాదేవి శక్తులను సమీకరించుకొని రాక్షసుని సంహరిస్తుంది. రాక్షసుడు వధింపబడిన స్థలం మరణకట్ట గా నిలిచిపోయింది. కన్నడంలో కొల్లు అంటే చంపు అని అర్థం. దీనితో కొల్లూరు అంటే చంపిన స్థలం అని అర్థమని కూడా చెబుతారు.
ఆలయ విషయానికి వస్తే, దేవత యొక్క మొట్టమొదటి స్థానం కుడజాద్రి శిఖరం మీద ఉండేదని, సర్వజనులు కొండ ఎక్కి వెళ్ళటం చాలా కష్టమవడంతో, శంకరాచార్యులు ఆ దేవాలయాన్ని కోలూర్ లో తిరిగి స్థాపించారని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడి పంచముఖ గణేశ యొక్క శిల్ప నిర్మాణం విశిష్టంగా ఉంటుంది.
ఇలా ఎన్నో మహిమలు గల ఈ అమ్మవారి ఆలయానికి కర్ణాటక భక్తులేకాక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటారు.