This Write Up On The Movie ‘వేదం’ Shows How This Movie Captured The Lives Of Indians Authentically

0
365

Written By: Jayanth Deepala

దేశాన్ని రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల్లో ఎవరైనా చూసి ఉంటారా ?

నేను చూసా. 2010 లోనే చూసా. ఇప్పటికీ చూస్తూనే ఉంటా.

నేను చూసా అనడం కంటే Krish Jagarlamudi గారు రచించి, Gnana Shekar V S గారి కంటితో మనకు చూపించారు.

5 Vedamస్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ దేశపు ఒక సమస్యని అడగకనే అడుగుతుంది.

జీవితంలో మేన్ లీడ్ అంటూ ఎవరూ ఉండరు, కాల గర్భానికి అందరూ సమానమే అని చూపిస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఏ క్యారెక్టర్ ఎంత బరువు ఉంది అనేదాని కన్నా ఒక్క క్షణం కనిపించినా ఆ క్యారెక్టర్ కి కథలో ఒక పర్పస్ చూపించిన సినిమా ఇది.

కేబుల్ రాజు – చదువుకున్నా సరైన ఉద్యోగం రాని పరిస్థితుల్లో తనదైన స్టైల్లో ‘ రాజు ‘ లా బతుకుతూ తన బస్తీ నుంచి దూకి జూబ్లీ హిల్స్ వైపు తన ప్రేమ కేబుల్ వేసి ఆ కేబుల్ వల్ల వచ్చిన ఖర్చుల యవ్వారం వల్ల జీవితాన్ని నేర్చుకొని దాన్ని సార్థకం చేసిన ఓ కేబుల్ ఆపరేటర్.

1 Vedamవివేక్ చక్రవర్తి – తన ఇష్టం మీద బతకనివ్వని పేరెంటింగ్ సిస్టమ్ తో యుద్ధం చేస్తూ తనను తాను ప్రూవ్ చేస్కోవాలి అనుకుంటున్న సమయంలో ఫాల్స్ రిలీజియస్ ఆక్టివిటీస్ కి బలి అయ్యి అక్కడితో జీవితంలో సహాయం విలువ తెలుసుకొని దేశానికి అది ఎప్పటికీ రుణం తీర్చుకోలేని సహాయం ఒకటి చేసిన ఓ మ్యూసీషియన్.

3 Vedamసరోజ – తాను అలవాటు పడ్డ వృత్తి రీత్యా తప్పుడు పోలీసింగ్ కి గురి అయ్యి తన కొత్త బిజినెస్ కి నాంది పలికే లోపే దానికి స్వస్తి చెప్పి , తప్పుడు పోలీసింగ్ ని ప్రశ్నించి మరీ సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఓ వేశ్య.

2 Vedamరాములు – పటేల్ వ్యవస్థ పెత్తనం చలాయిస్తున్న ఓ ఊరిలో అప్పు ముప్పులో పడి తన అవయవాలు అమ్ముకుంటూ తన మనవడి కోసం జీవితాన్ని నేస్తున్న చదువురాని ఓ నేతన్న.

రహీముద్దిన్ ఖురేషి – మతాన్ని గులాల్గా పూస్కోని రౌడీయిజం చేసే ఓ అల్లరి మూక వల్ల తన రేపటిని కోల్పోయి, తను నమ్ముకున్న మతం ఈ దేశంలో తనని ప్రశాంతంగా బతకనివట్లేదు అనే భయాన్ని పోగుచేసుకు దేశం దాటుదామనుకున్న తనని మతం కళ్ళతో చూసే వ్యక్తుల మధ్యన పడేసింది జీవితం. అక్కడితో ఆగకుండా తన వ్యక్తిత్వం వల్ల అందరి కళ్ళు తెరిపించి మనిషిని మతం కళ్ళతో చూడొద్దని నేర్పిన ఓ భయస్తుడు.

4 Vedamకర్పూరం : తన జెండర్ బట్టి తనని ట్రీట్ చేస్తున్నారని తెలిసి దాన్ని బట్టి తన జీవితాన్ని ఆ ట్రీట్మెంట్ కి తగ్గట్టుగా ఇమడ్చుకోని లోకం గుట్టు సరోజ కి నేర్పుతూ, ఎవరూ తన జెండర్ గురించి, వారి అవసరాల గురించి, వారి సంక్షేమం గురించి పట్టించుకోరా అని అడగకనే అడిగే ఓ నపుంసకురాలు.

పద్మ : తన బట్టలను కూడా చూడకుండా కొడుకు చెప్పుల గురించే ఆలోచిస్తూ వాడి చదువే తన జీవితంగా బతుకుతూ దాని కోసం తన కడుపునే కుదగ పెట్టే ఓ నిషానీ మాతృ మూర్తి.

జారా : తన జీవితాన్ని కోల్పోయినా ఈ దేశం తమ ఇళ్లని , వారి భవిష్యత్తు పదిలమని తన భర్తకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఆయన భయానికి ఓడి తన వెంట దేశం దాటుతున్న ఓ మేలిమి భార్య.

పూజ : ఎంత పెద్ద ఇంట్లో పుట్టినా ఇంకా ఎన్ని ఏళ్లు నాగరికత పెరిగినా పెళ్లి విషయంలో మాత్రం ప్రేమ కుదరదు అనే ప్రశ్నే బతుకై బతికే ఓ శ్రీమంతుని కూతురు.

లాస్య : మనిషికి మనిషే సహాయం చేయాలి , పక్క వారు చేస్తారులే అనుకుంటూ అందరూ పోతే ఎవరూ ఎవరికి సహాయం చెయ్యలేరు అని మనకీ వివేక్ కీ నేర్పిన అందమైన ఓ పియానిస్ట్ .

శీనుగాడు : ప్రపంచం లోతు తెలీకుండా తన ఊరే ప్రపంచంగా ఆ పటేల్నే విలన్గా చూస్తూ ఒంటి నిండా చదువు నింపుకుని వడ్డీ లెక్కలు బాగా వేసే ఓ విద్యార్థి.

గణపతి : బస్తీ లో పుట్టాము , మన బతుకులు ఇంతే అని ఫిక్స్ అయినా, తన నేస్తం వాడిని ఆ దరిద్రం నుంచి తన ప్రేమతో బయట పడేస్తాడు అని తన ప్రేమకి ఉడత సహాయం చేస్తూ బతుకు మారుద్దని ఎదురుచూస్తూ ఉండే ఓ అమాయకుడు.

ఇలాంటి క్యారెక్టర్లు సినిమాని చూపించనేలేదు కానీ అంతకుమించి మన దేశ ప్రజల జీవితాల్ని చూపించాయి.

దేశానికి ఏదైనా ఆపద వస్తే ఇలాంటి వారంతా తమ కష్టాలని పక్కన పెట్టి మరీ పోరాడుతారు అని చూపించాయి.

దేశానికి ప్రజలే సైనికులు అని చూపించాయి.

ఎప్పటికీ మనం మొదట భారతీయులమే అని చూపించే చిత్రం ఇది.

ఇలా , ఇంతిలా దేశాన్ని నిజంగా చూపించిన సినిమా నేను ఇప్పటివరకు చూడలేదు.

ఎప్పటికీ ఈ వేదం , తెలుగు సినీ ప్రజల మనసులో చదవని ఓ మధురమైన చేదు వేదం.

జీవితాన్ని నేర్పించిన వేదం.

ఇలాంటి సినిమా ఇంకోటి తీయండి అని నేను Krish Jagarlamudi గారిని అడగను , ఎందుకంటే అలాంటివి విరివిగా రావు.

కానీ ఇలాగే నిజాలు చెప్పండి అని మాత్రం అడుగుతా.

ఈ ‘ కంచె ‘ లను మాకు మీరు వేదాలా ఎప్పటికప్పుడూ ఎల్లప్పుడూ చూపించడమే మీ ” గమ్యం ” అవ్వాలని కోరుతూ…

కృష్ణం వందే జగద్గురుం

SHARE