తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని స్థల పురాణం. ఇంకా ఒకసారి వచ్చిన వరదల్లో ఈ ఆలయం కొట్టుకు పోయిందని ఆ తరువాత అప్పటి రాజులూ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి నుండి 13 కి.మీ. దూరంలో చంద్రగిరి వెళ్లే మార్గంలో తొండవాడ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలోనే అగస్త్వేశ్వరాలయం ఉంది. ఇక ఈ ఆలయానికి అనుకోని సువర్ణముఖి నది, ఆ నదికి అవతలి ఒడ్డున తొండవాడ గ్రామం ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి కొద్దీ దూరంలోనే భీమనది, కల్యాణీనది, సువర్ణముఖి నది సంగమం ఉంది. ఈవిధంగా మూడు నదులు కలవటం వల్ల త్రివేణి సంగమ ఫలితం లభించిందని అగస్త్యుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒక రోజు ఆయన నదీస్నానం చేస్తుండగా ఆయనకి ఒక సహజ లింగం దొరుకగా దానిని ఆ నదీతీరాన ప్రతిష్టించించి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. అయితే కాలక్రమంలో ఆ ఆలయం సువర్ణముఖి నది వరదల్లో కొట్టుకొని పోయింది. ఈ విషయం తెలుసుకున్నా చోళరాజులు మళ్ళీ ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ప్రతిష్టించారు. అగస్త్యుడు ప్రతిష్టించిన లింగం కనుక ఆ స్వామిని అగస్త్యేశ్వరుడు అని అమ్మవారు ఆనందం పెంపొందించే తల్లి కనుక ఆమెని ఆనంద వల్లి అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర, పద్మావతీదేవిల వివాహం అయినా తరువాత వారు కొంతకాలం అగస్త్యుల వారి ఆనతి మేరకు ఇచట నివసించారని భక్తులు చెప్తారు. ఈ ఆలయం వెలుపల సీతారాముల ఆలయం కూడా ఉంది. ఇలా వెలసిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.