ఈ ఆలయం పడమటి సింహాచలం గా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ విశేషం ఏంటంటే వరాహస్వామి, నరసింహస్వామి ఇద్దరు ఒకేచోట భక్తులకి దర్శనం ఇస్తారు. ఈ ఆలయం చాలా మహిమగలదని భక్తుల నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలోని న్యూ గంజ్ సింహగిరి ప్రాంతంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో వరాహస్వామి, నరసింహస్వామి ఒకేచోట భక్తులకి దర్శనం ఇస్తుండటంతో ఈ దేవస్థానం మరింత మహిమాన్వితమైనదని తెలుస్తుంది. అయితే ఈ ఆలయంలో స్వామివార్లు వేరు వేరు కాలంలో విభిన్నంగా ఇక్కడ వెలిశారు. ఇలా స్వామివార్లు వెలసిన ఈ ఆలయాన్ని పడమటి సింహాచలం భక్తులు పిలుస్తారు. ఈ ఆలయంలోని రాజగోపురంపై రామ, కృష్ణ ప్రతిమాలతో పాటుగా ఇతర దేవతామూర్తులు కూడా ఉన్నారు. ప్రధానాలయ ప్రాంగణం ముందు పంచలోహ సమన్వితమైన ధ్వజస్థంభం, బలిపీఠం దర్శనం ఇస్తాయి. గర్భాలయానికి ముంద ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులతో స్వామివారి గర్భాలయానికి వెండిమకర తోరణంతో 9 తలల శేషుడు, ఛత్రం కాగా, వెండి కిరీటాన్ని ధరించిన స్వామి, శంఖు చక్రాలను ధరించి, స్వామివారి ఎడమ తొడపై లక్ష్మి అమ్మవారు ఆసీనురాలై భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో అనేక విగ్రహ మూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం వెనుక ఉన్న కొండమీద రాతి గుండ్ల మీద వరాహస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు, పుష్కర మహోత్సవాలు గొప్ప నిర్వహిస్తారు. అంతేకాకుండా మాఘ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.