తిండి తింటే కండకలదోయ్ కండ కలవాడేను మనిషోయ్. అని గురజాడ అన్నట్లు ఆహారమే మనకు ఆరోగ్యం. బలవర్ధకమైన తిండి తింటేనే ఏ రోగం లేకుండా బతుకగలం. మారుతున్న కాలం కాలుష్యం తో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే సవాలుగా మారుతుంది. వీటన్నింటినీ అధిగమించాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మనకు రక్ష. పౌష్టికాహారమే దివ్యౌషధం. సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనకు అందుబాటులో ఉండే పాలు, పండ్లు, పప్పులు, కూరగాయలు, గుడ్లు, తృణధాన్యాలతో ప్రాణాంతకమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
వేల కొద్దీ ఆహార పదార్థాల్లో శరీరానికి ఎక్కువ మేలు చేసేవి ఏవో కనిపెట్టడం కాస్త కష్టమే. అందుకే ఆ బాధ్యతను కొందరు శాస్త్రవేత్తలు భుజాన వేసుకున్నారు. వెయ్యికి పైగా ఆహార పదార్థాలపై అధ్యయనం జరిపి, అత్యధిక పోషకాలు కలిగిన కొన్ని పదార్థాలను ఎంపిక చేశారు. అవేంటో తెలుసుకుందాం.
కారం శక్తి: 100గ్రాములకు 282 కి.క్యాలరీలు
విటమిన్ సి, ఇ, ఏ లాంటి ఫైటో కెమికల్స్‌తో పాటు కెరొటినాయిడ్లు, ఫినోలిక్ పదార్థాలు పచ్చికారంలో సమృద్ధిగా ఉంటాయి.
గడ్డకట్టిన పాలకూర శక్తి: 100గ్రాములకు 29 కి.క్యాలరీలు
మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఏ తోపాటు బీటా కెరొటిన్, జియాజాంతిన్ లాంటి పోషకాలు పాలకూరలో పుష్కలం. పాలకూరను ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల ఆ పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. అందుకే తాజా పాలకూర తో పోలిస్తే గడ్డకట్టిన పాలకూరకే పోషకాహర జాబితాలో మెరుగైన స్థానం దక్కింది.
సింహ దంతి (డండెలయన్ గ్రీన్స్) శక్తి: 100గ్రాములకు 45 కి.క్యాలరీలు
డండెలయన్ అంటే సింహపు దంతాలని అర్థం. సింహ దంతి మొక్క ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ తోపాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.
పింక్ గ్రేప్ ఫ్రూట్ శక్తి: 100గ్రాములకు 42 కి.క్యాలరీలు
చూడ్డానికి ఇవి నారింజ పండ్లలానే ఉంటాయి. కెరొటినాయిడ్లు, లైకోపీన్ పిగ్మెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటి లోపలి భాగం ఎర్రగా ఉంటుంది.
స్కాలప్స్ (చిప్పలు) శక్తి: 100గ్రాములకు 69 కి.క్యాలరీలు
నీటివనరుల్లో దొరికే ఈ స్కాలప్స్‌లో కొవ్వు పదార్థాలు తక్కువ, ప్రొటీన్, ఫ్యాటీ ఆమ్లాలు, పొటాషియం, సోడియంలు ఎక్కువ.
ఎర్ర క్యాబేజీ శక్తి: 100గ్రాములకు 31 కి.క్యాలరీలు
యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా లభించే ఈ ఎర్ర క్యాబేజీలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఉల్లి కాడలు శక్తి: 100గ్రాములకు 27 కి.క్యాలరీలు
ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఉల్లికాడలు కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి మినరల్స్‌కు ప్రధాన వనరు. విటమిన్ కె కూడా వీటిలో మెండు.
అలాస్కా పొలాక్ శక్తి: 100గ్రాములకు 92 కి.క్యాలరీలు
ఈ సముద్ర చేపలు ఎక్కువగా గల్ఫ్ ఆఫ్ అలాస్కా ప్రాంతంలో లభిస్తాయి. వీటిలో కొవ్వు 1శాతం కంటే తక్కువే ఉంటుంది.
పచ్చి బఠానీ శక్తి: 100గ్రాములకు 77 కి.క్యాలరీలు
పచ్చి బఠానీల్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
టంగిరైన్స్ శక్తి: 100గ్రాములకు 53 కి.క్యాలరీలు
నిమ్మజాతికి చెందిన ఈ పండులో ఉండే క్రిప్టోజాంతిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
వాటర్ క్రెస్ (ఆడేలు కూర) శక్తి: 100గ్రాములకు 11 కి.క్యాలరీలు
ప్రవహించే నీటి వనరుల్లో ఈ ఆకుకూర పెరుగుతుంది. శరీరంలో మినరల్స్ శాతం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఔషధంలా ఉపయోగిస్తారు.
బచ్చల కూర శక్తి: 100గ్రాములకు 19 కి.క్యాలరీలు
బెటాలైన్స్ అనే అరుదైన పోషకాలు ఇందులో ఉంటాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్ గుణాలు కనిపిస్తాయి.
గుమ్మడికాయ విత్తనాలు శక్తి: 100గ్రాములకు 559 కి.క్యాలరీలు
ఐరన్, మ్యాంగనీస్ అత్యధికంగా ఉండే వనరుల్లో గుమ్మడికాయ విత్తనాలు ముందు వరసలో ఉంటాయి.
చియా గింజలు శక్తి: 100 గ్రాములకు 486 కి.క్యాలరీలు
చియా గింజల్లో ఫైబర్, ప్రొటీన్లతో పాటు లినోలెనిక్ యాసిడ్, ఫినోలిక్ యాసిడ్ , విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
బాదం శక్తి: 100 గ్రాములకు 579 కి.క్యాలరీలు
శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యధిక పోషకాలు కలిగిన పదార్థం బాదమే. మోనో-అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఇందులో అధికంగా ఉంటాయి. గుండె కండరాల ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఇవి ఉపయోగపడతాయి.