దేవాలయంలో వెలసిన స్వామికి కొన్ని పండుగ పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఈ ఆలయంలో ఏడాదిలో ఒకసారి మాత్రమే భక్తులు కొన్ని వేల సంఖ్యల్లో వస్తుంటారు. మరి ఆ ఒక్క రోజు మాత్రమే ఎందుకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, కళింగ పట్నం కి దగ్గరలో ఉన్న బోరవని పేట గ్రామం, వంశధార నది ఒడ్డున సాలిహుండంలో కొండపైన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉంది. స్తల పురాణం ఆధారంగా శాలివాహన కాలం నుండి కొండపైన ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామిగా పిలుస్తారు.అయితే భీష్మ ఏకాదశి జాతరను సాలిహుండం గ్రామస్థులు వారి ఊరి ఉత్సవంగా భావించి చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ది ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి నాడు శ్రీ వేణుగోపాల స్వామి పుట్టిన రోజు వేడుకలు జరుపుతారు. ఈ ఉత్సవం రోజునే ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శుక్రవారం శ్రీ వేణుగోపాలుని యాత్ర ని నిర్వహిస్తారు.భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే ఉత్సవమూర్తులను పల్లకిలో మేళ, తాళాలతో ఊరేగింపుగా వెళ్లి వంశధార నది మధ్యలో అర్చకస్వాములు స్వామివారికి చక్ర స్నానం చేయిస్తారు. అక్కడి నుంచి శ్రీ స్వామివారిని తీరు వీధులలో ఊరేగిస్తారు. దీనినే తిరువీధి ఉత్సవం అంటారు. ఇంకా దీనినే కాళీయమర్దన శ్రీ వేణుగోపాలుని యాత్ర అని, సాలిహుండం యాత్ర అని మరియు కొండ మీద యాత్ర అని పలు రకాలుగా పిలుస్తారు.ఇక ఈ ఆలయంలో స్వామి దర్శించుకునే భక్తులు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్య స్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకొని స్వామి దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక కొండపైన వేణుగోపాలుని దర్శించిన భక్తులు అక్కడికి దగ్గర్లో ఉన్న విరవసంతేశ్వరస్వామిని దర్శించడం ఆనవాయితీ.ఇలా సంవత్సరంలో ఒక గొప్ప ఉత్సవం జరిగే ఈ వేణుగోపాలస్వామి దేవాలయానికి స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటారు.