ప్రతి ఆలయంలో మహాశివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే లక్ష్మి నరసింహస్వామి భక్తులకి లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. ఇలా లక్ష్మి నరసింహస్వామి శివలింగ రూప దర్శనం ఇచ్చే ఈ అరుదైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, సింగోటం అనే గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి శివ కేశవులకు అభేదంగా ఉన్నట్లు లింగరూపంలో పూజలందుకుంటున్నాడు. యాదగిరి గుట్టలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహ ఆలయం తరువాత అంతటి మహా పుణ్యక్షేత్రం ఇదేనని చెబుతారు.
ఇక ప్రధానాలయానికి ఎదురుగా రత్నగిరి కొండపై రాణి రత్నమాంబ నిర్మించిన రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సురభి వంశానికి చెందిన పాలకులలో 11 వ తరానికి చెందిన సింగమనాయుడు అనే భూపాలుడి పాలన కాలంలో చిన్న ఆలయం నిర్మించగా నేడు అదే ప్రాంతంలో అతి పెద్ద ఆలయం నిర్మించబడింది.
లింగరూపంలో ఉండే లక్ష్మీనరసింహ స్వామి లింగాకారమునకు కళ్ళు, నోరు, ముక్కు చిహ్నములు మరియు తొమ్మిది చక్రములు, బొడ్డువద్ద రత్నం పొదిగి ఉండి భక్తులకి దర్శనం ఇస్తుంటుంది. ఇక్కడ స్వామివారికి నిత్యాభిషేకం తరువాత పంచలోహ కవచంతో కప్పబడును. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే స్వామివారు నిలువు నామాలతో పాటు అడ్డా నామాలు కూడా కలిగి ఉంటాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ వెలసిన ఆ స్వామిని మ్రొక్కుబడుల స్వామిగా నమ్మి కొలిచి పూజిస్తారు.
ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పవిత్ర క్షేత్రంలో సంక్రాంతి అనంతరం 45 రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అంతేకాకుండా జాతర సందర్భంగా స్వామివారికి కళ్యాణం, రధోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లింగరూపంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామిని దర్శించి తరిస్తారు.